దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తీరు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధి కోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తునప్పటికీ తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసరికి ఆచరణ శూన్యంగా మారింది. తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం జరిగిన ఘటనే దీనికి చక్కటి నిదర్శనం.
పాముకాటుతో మహిళ పరిస్థితి విషమం - government hospital
సర్కారు వైద్య రంగానికి వేల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రమే. దవాఖానాల్లో సరైన వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు లేక పాము కరిచిన మహిళ పరిస్థితి విషమంగా మారడం వల్ల సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మండల కేంద్రానికి చెందిన జటంగి సైదమ్మ అనే మహిళా రైతు తన చేనులో పత్తి తీయడానికి వెళ్లగా పాము కాటేసింది. వెంటనే తోటి కూలీలు తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు గంటలు గడిచినా ఆస్పత్రిలో వైద్యులు లేక వైద్య సేవలు అందలేదని బంధువులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఉన్న ఏఎన్ఎం ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆ మహిళ పరిస్థితి విషమంగా మారడం వల్ల అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చూడండి: పులిపోస...ఇదంటే మన్యం ప్రజల గుండెల్లో హడల్ !