తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతీ గుండె ధైర్యమై... నరనరానా ప్రవహించే దేశభక్తివై... - bharat anchina border attack

నీ త్యాగం వృథా కాదు... నీ తెగింపు మరిచేది కాదు... దేశం యావత్తు నీ మరణం అజరామరం అని గొంతెత్తుతోంది... వింటున్నావా సంతోషన్నా. నీవు భౌతికంగా మాకు దూరమైనా... సరిహద్దులో ఎగిరే జాతీయ జెండా రెపరెపల్లో... భారత్​మాతాకీ జై అన్న నినాదంలో ఎప్పటికీ బతికే ఉంటావు సైనికా...

colonel santhosh babu cremation cerimony
ప్రతీ గుండె ధైర్యమై... నరనరానా ప్రవహించే దేశభక్తివై...

By

Published : Jun 18, 2020, 7:40 PM IST

వేకువజామునే ప్రతాపం చూపించే సూర్యుడు... ఇవాళ సూర్యాపేటలో కానరాలేదు. లోకానికి వెలుగు నిచ్చే భానుడు... దేశం కోసం ప్రాణాలిచ్చిన సంతోష్​ త్యాగానికి నివాళి అర్పించినట్లుగా మబ్బుల మాటుకు వెళ్లిపోయాడు. దేశ రక్షణ కోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్‌బాబు అంతిమసంస్కారాలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఉద్విగ్నభరితంగా సాగిన యాత్రలో దారిపొడవునా భారత్‌ మతాకీ జై..... జోహార్ సంతోష్‌బాబు.. అంటూ అమరుడి త్యాగాన్ని వేల గొంతుకలు స్మరించుకున్నాయి. కల్నల్ సంతోష్‌బాబు పార్ధీవదేహంపై.. దారి పొడవునా నిలబడిన ప్రజలు పూలవర్షం కురిపించారు. దారి వెంట వెళ్తున్న ప్రతి వ్యక్తి... పనిమీద వెళ్తున్నా... ఆగిన పాదం అంతిమయాత్రవైపు సాగింది. అడుగుకు అడుగులు జతలై రోడ్డంతా జన సంద్రంగా మారింది. దారి పొడవునా ప్రజలు కురిపించిన పూలవర్షంతో తడిసి ముద్దైంది.

శత్రుతూటాకు ఎదురొడ్డిన దేహం కట్టెల పాన్పుపై వాలింది. వీరుడిని మోసే భాగ్యం కలిగినందుకు ప్రతి కట్టె పులకించింది. వీరుడి దేహంపై గాయాలను చూసి మొరటు కట్టెలన్నీ మెత్తటి పాన్పుగా మారిపోయాయి. జీవం లేని దేహాన్నైనా మోసే భాగ్యం కలిగినందుకు సంతోష పడాలో... మంటలతో చుట్టుముడుతున్నందుకు బాధపడుతూ తమ ఆవేదనను వేడిరూపంలోను... దు:ఖాన్ని పొగరూపంలోను వెళ్లగక్కాయి. ఈ దృశ్యాన్ని చూస్తున్న ప్రతి గుండె బరువెక్కింది. ప్రతి కంట కన్నీటి పొర అలుముకుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడికి యావత్‌భారతం కన్నీటి వీడ్కోలు పలికింది. భౌతికంగా దూరమైన నీరూపం నీవు ఎప్పటికీ దూరం కాలేదు. సరిహద్దులో పహారాకాస్తూ... ధైర్యం సన్నగిల్లిన వేళ కనిపిస్తూ... రోమరోమానా ధైర్యాన్ని నింపుతూ.. సరిహద్దులో తిరుగుతూనే ఉంటావు సైనికా...

ఇవీ చూడండి:రణక్షేత్రంలో నేలకొరిగిన భారతమాత వీరపుత్రుడికి వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details