తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాశాల అధ్యాపకులు.. ఇప్పుడు కరవు పనులతో కూలీలయ్యారు..! - college lecturers jobs

పుస్తకాలు పట్టి పాఠాలు చెప్పిన సార్లు.. ఇప్పుడు పారలు పట్టి మట్టి పనికి పోతున్నారు. ఎంతో మంది యువత ఉపాధి పొందేందుకు దారి చూపిన అధ్యాపకులు.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. వచ్చిన పనికి అవకాశం లేక... వేరేమైనా చేద్దామంటే పని దొరక్కా.. అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. ఉన్నత చదువులు చదివి.. ఎందరో ఉన్నత స్థానాలు చేరేందుకు పాఠాలు చేప్పిన ఆ మాస్టార్లు.. చివరికి గ్రామస్థులతో కలిసి ఉపాధిహామి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు.

college lecturers became as labours in rural employment guarantee scheme velishala
college lecturers became as labours in rural employment guarantee scheme velishala

By

Published : Jul 18, 2021, 1:47 PM IST

Updated : Jul 18, 2021, 3:22 PM IST

కళాశాల అధ్యాపకులు.. ఇప్పడు కరవు పనులతో కూలీలయ్యారు..!

కరోనా మహమ్మారి విసిరిన పంజాకు ఎంతో మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. కరోనా మొదటి దశ తగ్గుముఖం పట్టేనాటికి కొన్ని రంగాలు గాడిన పడగా... మరికొన్నింటి పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను వైరస్​ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడంతో వారి బతుకు అతలాకుతలమైంది. ఆన్​లైన్​ క్లాసులకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. విద్యార్థుల నుంచి సరైన స్పందన లేదనే సాకుతో యాజమాన్యాలు వేతనాలపై వేటు విధిస్తున్నాయి. ఉపాధ్యాయుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఉచిత బియ్యంతోపాటు నెలకు రెండువేల భృతిని అందిస్తోంది. ఇది ప్రైవేటు ఉపాధ్యాయులకు కొంత ఊరటనివ్వగా... ప్రైవేటు కళాశాల అధ్యాపకులకు మాత్రం నిరాశే మిగిల్చింది. ఇన్ని ప్రతికూలతల మధ్య... బోధననే నమ్ముకున్న ఆ అధ్యాపకులు తమ బాధలు తీర్చుకునేందుకు ఉపాధి హామీ పథకాన్నే మార్గంగా ఎంచుకున్నారు.

గౌరవమే తప్ప పని దొరకలే..

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన పలువురు... సుమారు పదేళ్లుగా బోధన రంగంలో ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఆయా సబ్జెక్టులను బోధిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో విద్యాసంస్థలు మూతపడటం వల్ల వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి కరవవటంతో ఆర్థికంగా కష్టాలు ప్రారంభమయ్యాయి. సొంతూరికి వెళ్లి ఏదైనా పనిచేసుకుంటామని వెలిశాలకు వచ్చేశారు. బోధననే వృత్తిగా ఎంచుకున్న వారు కరోనా తీసిన దెబ్బతో.. ఏదో ఒక పని చేసేందుకు సిద్ధమయ్యారు. సార్​ అంటూ సంబోధిస్తూ గౌరవం ఇవ్వటమే తప్ప... ఎవరూ పని మాత్రం ఇవ్వలేదు. ఏ పనీ దొరకకపోవడం వల్ల... సర్పంచ్​తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు తమకూ అవకాశం కల్పించాలని వేడుకున్నారు. సర్పంచ్​, కార్యదర్శి సానుకూలంగా స్పందించటంతో... ఏడాది నుంచి గ్రామస్థులతోపాటు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తూ... పొట్టపోసుకుంటున్నారు

  • ఉపాధి హామీనే ఆధారం...

"దాదాపు పదేళ్లుగా బోధననే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. కరోనా వల్ల కళాశాలు మూతపడటం వల్ల మా జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఎక్కడికి వెళ్లినా పని దొరకలేదు. కుటుంబ పోషణ భారమైంది. ఆ సమయంలోనే సర్పంచ్​ దగ్గరికి వెళ్లి మేమూ ఉపాధి హామీ పనులు చేస్తామని కోరగా.. మాకు అవకాశం కల్పించారు. రోజుకు రూ. 170 నుంచి రూ. 230 వరకు కూలీ అందుతుంది. భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయంగా ఉంది. ప్రస్తుతం మా కుటుంబాలను ఉపాధి హామీ పనులైతే ఆదుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే ఆధారమైంది. కానీ ప్రభుత్వమే మాకు శాశ్వత పరిష్కారం చూపించాలి."

- అధ్యాపకులు, వెలిశాల.

ఉద్యోగావకాశాలు కల్పించండి..

ఉన్నత చదువులు చదివిన తమకు విద్యార్హతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎంతోమంది ప్రైవేటు అధ్యాపకులు కరోనా భారిన పడి.. సరైన చికిత్స పొందలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వాళ్లందరి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి... ప్రైవేటు అద్యాపకులకు ఉపాధి కల్పించాలని విన్నవించుకున్నారు. కనీసం... ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇచ్చినట్టు రెండు వేల ప్రోత్సాహకం, బియ్యమైనా అందించాలని వేడుకుంటున్నారు

ఇదీ చూడండి: అంపశయ్యపై కనకరాజు: ఇందిరాగాంధీతో నృత్యం చేసిన 'పద్మశ్రీ'కి పలకరింపే కరవైంది!

Last Updated : Jul 18, 2021, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details