హుజూర్‌నగర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో తెరాస పార్టీని గెలిపించిన ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలో ప్రతీ పల్లె అభివృద్ధితో వెలుగొందేందుకు అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు. పలు కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వేదికపై ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ధన్యవాద సభలో రికార్డు మెజార్టీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సీఎం కేసీఆర్... నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వర్షం కురిపించారు. హుజూర్‌నగర్ పరిధిలో ఉన్న134 గ్రామపంచాయతీలన్నింటికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 7 మండల కేంద్రాలకు రూ.30 లక్షలు కేటాయించారు. హుజూర్ నగర్‌కు సీఎం ఫండ్ నుంచి రూ. 30 కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గిరిజన గురుకుల పాఠాశాల, బంజారా భవన్, ఈఎస్‌ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించనున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో కల్వర్టులు కట్టాల్సిన అవసరం ఉందని... వాటన్నింటిని త్వరలోనే నిర్మిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్‌గా హుజుర్‌నగర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశుభ్రమైన పట్టణంగా హుజూర్‌నగర్ నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.