సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. అనేక పరిణామాల మధ్య ఎన్నికను సోమవారం రెండు సార్లు వాయిదా వేయాల్సివచ్చింది. నేరేడుచర్ల పురపాలికలో మొత్తం 15 స్థానాలకు గాను తెరాస, కాంగ్రెస్ ఏడేసి వార్డుల చొప్పున గెలుచుకోగా... సీపీఎం ఒకటి దక్కించుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఎంతో పీఠం నిలబెట్టుకోవాలని... హస్తం పార్టీ భావించింది.
కానీ ఎక్స్అఫిషియో సభ్యులుగా హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఉండటంతో... తెరాస బలం పదికి చేరుకుంది. సీపీఎంతో కలిపి ఎనిమిది స్థానాలున్న కాంగ్రెస్... ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఓటుతో వారి సంఖ్య కూడా పదికి చేరుకుంది.
కేవీపీకి సానుకూలం..
కేవీపీ పేరును ఎక్స్అఫిషియో సభ్యుడిగా ముందుగానే నమోదు చేయించినా... తుది జాబితాలో కనపడలేదు. దీంతో ఉత్తమ్ సహా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు... సూర్యాపేటలో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మూణ్నాలుగు గంటల పాటు అక్కడే ఆందోళన నిర్వహించారు. కేవీపీకి ఓటు హక్కు కల్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఉత్తమ్ ఆశ్రయించారు. ఈసీ.. కేవీపీకి సానుకూలంగా ఉత్తర్వులిచ్చింది. కమిషనర్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.