సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా శివారులోని వివాదాస్పద భూములు.. క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఆదివారం భాజపా నిర్వహించిన గిరిజన భరోసా యాత్ర.. ఘర్షణకు దారితీసింది. పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో.. ఘటనకు పార్టీ సీనియర్ నేతలు కారకులంటూ.. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై మఠంపల్లి పోలీసు స్టేషన్‌లో సెక్షన్ 143, 144, 147, 148, 332, 333 కింద కేసులు నమోదయ్యాయి.
భాజపా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డిని ఏ1 నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. ఘటనకు కారకులుగా భావిస్తున్న మరో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 21 మందిపై కేసులు నమోదు చేశారు. నిర్వాసితుల భూములను పరిశీలించేందుకు బండి సంజయ్ సభా వేదికకు వస్తున్న క్రమంలో... గుర్రంబోడు శివారులోని ప్రైవేటు కంపెనీ షెడ్డును కూల్చేందుకు కార్యకర్తలు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.