suryapet Student Ragging Case : సూర్యాపేట వైద్యకళాశాలలో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. వసతిగృహంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతో పాటు దాడికి పాల్పడ్డారని విద్యార్థి ఆరోపించారు. గుండు గీసేందుకు యత్నించారని.. తప్పించుకుని వెళ్లి తండ్రికి ఫోన్ చేసినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి తండ్రి వెంటనే 100కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళనలో ఉన్న బాధితుడిని ఠాణాకు తరలించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. బాధితుడు, అతడి తండ్రి ఆరోపించారు. విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని, విచారణకు ఆదేశించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.
నిజమని తేలితే శిక్ష తప్పదు..
suryapet Student Ragging Case Updates : సూర్యాపేట వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ ఘటనకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ ఇవాళ నివేదిక ఇస్తుందన్న మంత్రి.. ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.