గుర్రంబోడు తండా గిరిజనుల్లో భరోసా నింపేందుకు భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో యాత్ర చేపడితే.. సీఎం కేసీఆర్ అక్కడ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డిని ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా తీసుకెళ్లారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కానీ ఇప్పటివరకు వారిని అరెస్టు చేసినట్లు చూపించకుండా ఉండటం భయబ్రాంతులకు గురి చేయడమేనని అన్నారు. ఇప్పుడు రిమాండ్కు పంపుతున్నట్లు చెప్పి మరో 25 మందిపై కేసు నమోదు చేయడాన్ని రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేసులు పెట్టడం అన్యాయం
అర్ధరాత్రి ఆరుగురిని రహస్యంగా తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని.. తనతో పాటు 22 మంది పైన అక్రమంగా కేసు నమోదు చేశారని సంజయ్ ఆరోపించారు. ముగ్గురు వ్యక్తులకు కళ్లకు గంతలు కట్టి పోలీస్ స్టేషన్లను మార్చి చిత్రహింసలకు గురి చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టకుండా.. కేసీఆర్ భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా నిర్బంధాలకు గురిచేసినా భాజపా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు.