తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసతో యుద్ధం మొదలైంది.. గుణపాఠం చెబుతాం' - గుర్రంబోడు తండాలో ఉద్రిక్తత

ఆదివారం.. సూర్యాపేట జిల్లాలోని గుర్రంబోడు తండా రణరంగంగా మారింది. తండాలో వివాదాస్పద భూములను సందర్శించడానికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేతృత్వంలో ఆందోళనలు చెలరేగాయి. గిరిజనుల భూముల్లో ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు చేపట్టినందుకు నిరసనగా సంబంధిత షెడ్లను కూల్చే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం తెరాస ప్రభుత్వంపై బండి సంజయ్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాగర్​ ఉపఎన్నికల్లో తెరాసకు గిరిజనులు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

bandi sanjay, bjp
రణరంగంగా గుర్రంబోడు తండా

By

Published : Feb 8, 2021, 7:03 AM IST

Updated : Feb 8, 2021, 7:10 AM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ పరిధిలో భాజపా చేపట్టిన గిరిజనుల భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా ఆదివారం రణరంగంగా మారింది. ఈ తండా వద్ద 540 సర్వే నంబరులోని వివాదాస్పద భూములను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో నేతలు సందర్శించడానికి వచ్చినప్పుడు పరిస్థితులు లాఠీఛార్జి వరకు వచ్చాయి. సాయంత్రం 5.30 గంటలకు సంజయ్‌, ఎమ్మెల్యేలు రఘునందన్‌, రాజాసింగ్‌, పార్టీ నాయకురాలు విజయశాంతి.. బస్సులో గుర్రంబోడు వచ్చారు. సంజయ్‌ సమావేశ స్థలికి కొంచెం ముందుగా ఒక ప్రైవేటు కంపెనీ నిర్మించిన షెడ్డు వద్ద దిగారు. కార్యకర్తలు, గిరిజనులూ ఆయనను అనుసరించారు. షెడ్డు సమీపంలోకి చేరుకోగానే.. కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు తీశారు. షెడ్డుపైకి రాళ్లు విసిరారు. కర్రలతో షెడ్డు ధ్వంసానికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్లు పోలీసు అధికారులకు తగిలాయి. కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్‌నగర్‌ సీఐ రాఘవరావు, కోదాడ టౌన్‌ ఎస్సై క్రాంతికుమార్‌ల తలలకు గాయాలై రక్తస్రావమైంది. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. కార్యకర్తలను చెదరగొట్టారు. పావుగంట పాటు ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నుంచి సంజయ్‌, ఇతర నాయకులు వేదిక వద్దకు చేరుకున్నారు.

సభలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, పక్కన పార్టీ నేతలు

నాడు అయోధ్యలో రామ మందిరం కోసం.. నేడు గిరిజనం కోసం కరసేవ
నాడు అయోధ్యలో రామ మందిరం కోసం కరసేవ చేసిన భాజపా ఇక్కడ గిరిజనం కోసం అదే కరసేవను ప్రారంభించిందని బండి సంజయ్‌ అన్నారు. గుర్రంబోడు తండాలోని వివాదాస్పద భూములను పరిశీలించిన అనంతరం జరిగిన సభలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘70 ఏళ్ల క్రితం అడవి మృగాలతో పోరాడి భూములను బాగు చేసుకున్న గిరిజనులు ఇప్పుడు తెరాస నాయకులు, వారి బినామీలతో ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులపై దాడులకు దిగి భూములను ఆక్రమించుకోవడం దారుణం. వారిపై అక్రమ కేసులు బనాయించి 60 రోజులు జైళ్లలో పెట్టిన పైశాచికత్వం తెరాస ప్రభుత్వానిది. గుర్రంబోడు భూములను తిరిగి వారికి అప్పగించాలి. గిరిజనులపై జరిగిన లాఠీఛార్జీకి, వారి కన్నీటికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఈ నెల 10న నాగార్జునసాగర్‌లో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్‌ భూములపై గిరిజనులకు హామీ ఇవ్వాలి’’ అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

భాజపా యుద్ధం పోలీసులతో కాదు
భాజపా యుద్ధం పోలీసులతో కాదని, అవినీతి మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగానని సంజయ్‌ అన్నారు. 540 సర్వే నంబరులో అక్రమ నిర్మాణాలకు పోలీసు కాపలా పెట్టిన ప్రభుత్వం గిరిజనుల భూములను వారికే దక్కేలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై పోరాడుతున్న భాజపా కార్యకర్తలపై, గిరిజనులపై పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారమే లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. భరోసా యాత్ర సందర్భంగా జరిగిన పరిస్థితులను ఆసరా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తే ఇక సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌ ముంగిటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అప్రమత్తమైనా..

ఉద్రిక్త పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన పోలీసు అధికారులు దాదాపు 400 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వివాదాస్పదంగా ఉన్న భూములకు, మరోచోట తాత్కాలిక నిర్మాణాలకు రక్షణ కల్పించారు. మధ్యాహ్నం 12 గంటలకే బండి సంజయ్‌ రావాల్సి ఉన్నప్పటికీ.. సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. ఆయన వివాదాస్పద స్థలంలో కలియతిరిగారు. సమస్యకు మూల కారణంగా భావించిన ప్రైవేటు కంపెనీ షెడ్ల వైపు వెళ్లటంతో పరిస్థితి కొన్ని నిమిషాల్లోనే మారిపోయింది. ఉద్రిక్తతకు దారి తీసింది.

భాజపా కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో గాయపడ్డ కోదాడ పట్టణ ఎస్సై క్రాంతి కుమార్​, డీఎస్పీ రఘు

కేసీఆర్‌కు అనుకూలంగా ఉత్తమ్‌

ఇక్కడ గిరిజనులకు అన్యాయం జరిగితే సాగర్‌లో గిరిజనులు, వెనకబడిన వర్గాలు, దళితులు తెరాసకు తగిన గుణపాఠం చెబుతారని సంజయ్‌ వ్యాఖ్యానించారు. భూములు ఆక్రమించేందుకు వచ్చే వారిని తరిమి కొట్టాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. పేదలకు భాజపా అండగా ఉంటుందన్నారు. తెరాస, కాంగ్రెస్‌ గూండాలు గిరిజనులకు హాని చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేసీఆర్‌కు అనుకూలంగానే ఉంటారని ఆరోపించారు. తమ యాత్ర సందర్భంగా పోలీసులకు ఇబ్బంది కలిగితే క్షమించాలన్నారు. విజయశాంతి మాట్లాడుతూ తెగించి తెలంగాణ కోసం పోరాడిన ప్రజలు దొరతనం విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. తిరగబడి భూములను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందర్‌రావు, మాజీ మంత్రులు విజయరామారావు, రవీంద్రనాయక్‌, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రణరంగంగా మారిన గుర్రంబోడు తండా

ఇదీ చదవండి:కేసీఆర్​ 'కారు' మబ్బుల్ని మూడేళ్లలోనే చెదరగొడతారు: విజయశాంతి

Last Updated : Feb 8, 2021, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details