తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగును ప్రేమించాడు.. కొలువును త్యజించాడు.. నగధీరుడయ్యాడు!

వారసత్వంగా వచ్చిన భూమిని బీడు బారి పోకుండా పచ్చటి పంట పొలాలుగా మార్చాలనే ఉద్దేశంతో తాను చేస్తున్న కొలువు వదిలేశాడు. సొంత గ్రామంలో 20 ఎకరాల భూమిలో  పాలీ వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతుగా ప్రశంసలందుకున్నాడు. అతడే సూర్యాపేట జిల్లా తొండ గ్రామానికి చెందిన యువ రైతు సుంకరి కిరణ్​.

By

Published : Dec 26, 2019, 6:03 AM IST

best farmer in suryapet district
సాగును ప్రేమించాడు.. కొలువును త్యజించాడు.. నగధీరుడయ్యాడు!

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన సుంకరి కిరణ్ ఐటీఐ చదువు పూర్తి చేశాడు. అనంతరం నాగార్జునసాగర్, హైదరాబాద్​లో మెట్రో వాటర్ వర్క్స్​లో ఆపరేటర్​గా పనిచేసేవాడు. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్నాడని గ్రహించి... తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.

సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడులు

తండ్రి సలహా సూచనలతో రెండు సంవత్సరాల పాటు వ్యవసాయం చేసినా లాభాలు అంతగా రాలేదు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో తనకున్న 20 ఎకరాల భూమిలో రెండు ఎకరాలు మామిడి, రెండు ఎకరాలు నిమ్మ సాగు చేశాడు. మరో మూడు ఎకరాలు పంట మార్పిడి పద్ధతులతో కూరగాయల సాగు చేశాడు. మిగిలిన భూమిలో వరి, పత్తి, కంది,పెసళ్ళు వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో పండించి అధిక దిగుబడులను సాధించాడు.

కూలీలకు ఉపాధి కల్పిస్తూ...

వ్యవసాయంతో పాటు పాడి కోసం మూడు గేదెలను కొనుగోలు చేసి పాలపై రోజుకు 500 రూపాయలు అదనంగా సంపాదిస్తున్నాడు. వరి కోత యంత్రాలను ఉపయోగించకుండా కూలీలతో వరి కోయడం వల్ల గ్రామంలో కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. తన పొలంలో గడ్డి తరిగిపోకుండా కాపాడి పశువులకు 20 శాతం గడ్డిని అదనంగా పొందుతున్నాడు. వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం తన పొలం వద్ద స్వయంగా కంపోస్టు ఎరువులను తయారుచేసి పంటలకు వినియోగిస్తున్నాడు.

కలెక్టర్​ చేతులమీదుగా ఉత్తమరైతు అవార్డు...

ఇతని వ్యవసాయ పద్ధతులను చూసి గ్రామంలో మరికొంతమంది యువ రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. వ్యవసాయ రంగంలో కిరణ్ చేస్తున్న వినూత్న పద్ధతులను గుర్తించి 2017 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ ఉత్తమ రైతు అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈనెల 23న రైతు దినోత్సవ సందర్భంగా మంజీరా రైతు సమాఖ్య రంగారెడ్డి జిల్లా వారు సూర్యాపేట జిల్లా ఉత్తమ రైతుగా ఎంపిక చేసి హైదరాబాద్ రవీంద్రభారతిలో సన్మానించారు.

యువత వ్యవసాయం వైపు...

తమ గ్రామ వాసి ఉత్తమ రైతు అవార్డు పొందిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇతను పాటించిన విధానాలను అనుసరిస్తూ మరికొంత మంది యువకులు కూడా వ్యవసాయం వైపు మెుగ్గు చూపుతున్నారు.

సాగును ప్రేమించాడు.. కొలువును త్యజించాడు.. నగధీరుడయ్యాడు!

ఇవీ చూడండి: తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details