తెలంగాణ

telangana

ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త: మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది! - విస్తృతంగా ప్రచారం చేయాలి

ఇప్పుడు కొత్తగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 వైరస్ లాగా... గతంలో గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధి.. మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈమధ్య కాలంలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రమాదకర సంకేతాలనిస్తోంది.

aids-disease-spread-in-combined-nalgonda-district
తస్మాత్ జాగ్రత్త: మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది!

By

Published : Feb 14, 2020, 10:28 AM IST

Updated : Feb 14, 2020, 11:31 AM IST

తస్మాత్ జాగ్రత్త: మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది!

హెచ్ఐవీ.. ఈపేరు చెబితే వెన్నులో వణుకు పుట్టేది. వ్యాధి పుట్టిన కొన్నాళ్ల వరకు మరణం తప్ప.. మరో మార్గం లేని ఎయిడ్స్ వ్యాధికి.. క్రమంగా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. బాధితులు క్రమంగా తగ్గుముఖం పట్టారని భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కొత్తగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్తూ ఆ శాఖకు చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీయే.. కేసులు పెరుగుతున్నాయని గుర్తించింది. వ్యాధి నివారణ పేరిట ఒక్కో జిల్లాకు లక్షలు వెచ్చిస్తున్నా.. ఆశించిన ప్రయోజనం దక్కటం లేదు.

యువతకు ఎక్కువగా వ్యాప్తి..

నాగార్జునసాగర్, దేవరకొండ, నల్గొండ ప్రాంతాల్లో బాధితులు అధికంగా ఉన్నారని సర్వే చెబుతోంది. ఆయా ప్రాంతాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉండటం... లారీలు, ఇతర వాహనాల్లో మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో వ్యభిచారానికి పాల్పడటం.. తద్వారా వ్యాధి ముదురుతోందని అధికారులు అంటున్నారు. యువతకు ఎక్కువగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో ప్రతి నెల సరాసరి 42 మంది గర్భిణులకు పాజిటివ్ కేసులు నమోదౌతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది.

వెలుగులోకి కొత్త కేసులు...

నల్గొండ జిల్లాలో 2017లో 31 వేల 40 మంది పరీక్షలు చేయించుకుంటే.. 677 మందికి పాజిటివ్ వచ్చింది. 2018లో 32 వేల 349 మందిలో 703 నిర్ధరణ అయ్యింది. 2019లో అక్టోబరు నాటికి 295 మంది కొత్తగా వ్యాధి బారిన పడ్డారు. ఇక సూర్యాపేట జిల్లాలో 2017లో 228, 2018లో 373, 2019లో 277 మందికి వ్యాధి సోకినట్లు వెల్లడైంది. కోదాడ, హుజూర్​నగర్, నకిరేకల్, తుంగతుర్తి ఐసీటీసీ కేంద్రాల పరిధిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. హెచ్ఐవీ రోగులకు యాంటీ రిట్రో వైరల్ థెరపీ, ఏఆర్టీ కేంద్రాల్లో మందులు పంపిణీ చేస్తున్నారు. అత్యధికంగా సూర్యాపేట జిల్లా కేంద్రం ఆస్పత్రిలో రెండు వేల 355 మంది చికిత్స పొందుతున్నారు. అటు భువనగిరి జిల్లాలో 2017లో 232 మంది, 2018లో 255 మంది, 2019లో డిసెంబర్​ వరకు 32 మంది వ్యాధి బారిన పడ్డారు.

విస్తృతంగా ప్రచారం చేయాలి...

తగ్గుముఖం పడుతుందనుకున్న ఎయిడ్స్ వ్యాధి.. మళ్లీ పెరుగుతూ పోతుండటం పట్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చెబుతోంది. అందుకు తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తూ.. విస్తృతంగా జిల్లాల స్థాయిలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.

ఇదీ చూడండి :మంత్రి గారి చేతి కడియం కొట్టాశారు!

Last Updated : Feb 14, 2020, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details