సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో... ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఇతరులకు కట్టబెట్టిన ఇద్దరు తహసీల్దార్లపై వేటు పడింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుకు ఇచ్చిన భూములతో పాటు... అటవీ భూములపై అక్రమాలకు పాల్పడడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 540లో... 6700 ఎకరాల భూమి ఉంది.
పారిశ్రామికవేత్తలకు వత్తాసు
క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయకపోవడంతో... నిర్వాసితుల భూములేవో, అటవీ భూములేవో తేలక ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీన్ని అవకాశంగా మలచుకున్న తహసీల్దార్లు... స్థానికంగా ఉన్న సిమెంటు పరిశ్రమలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు చేశారు. సదరు భూములు తమవేనంటూ పారిశ్రామికవేత్తలు స్థానికులపై బెదిరింపులకు దిగడంతో.... వారంతా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు..
అడ్డగోలుగా మ్యుటేషన్లు
బాధితుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన కలెక్టర్... 12 మంది వీఆర్వోలు, ఆరుగురు సర్వేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల లెక్కతేల్చారు. వందల ఎకరాల భూముల్ని అడ్డగోలుగా మ్యుటేషన్ చేసినట్లు నిర్ధరించారు. ఉన్నది ఆరున్నర వేల ఎకరాలయితే... ఏకంగా 12 వేల ఎకరాలకు పట్టాలిచ్చినట్లు గుర్తించారు. అక్రమంగా పాసు పుస్తకాలు ఇచ్చినట్లు తేలడం వల్ల... మఠంపల్లి ప్రస్తుత తహసీల్దార్ వేణుగోపాల్‌తో పాటు గతంలో ఇక్కడ పనిచేసి, ప్రస్తుతం గరిడేపల్లి తహసీల్దార్‌గా ఉన్న చంద్రశేఖర్‌ను... కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సస్పెండ్ చేశారు. జిల్లాపాలనాధికారి చర్యలతో పెదవీడు వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పాలతో అభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు.
తరాలుగా సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి-సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైల్ సర్వీసులు!