తెలంగాణ

telangana

ETV Bharat / state

శుభకార్యం నుంచి వస్తూ అనంతలోకాలకు - pramadam

అప్పటి వరకు ఆనందంగా గడిపారు. దర్గాలో మొక్కు తీర్చుకున్నారు. బంధువుల ఇంటికి ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో అతివేగం వారి ఆనందాలను చిదిమేసింది. ఫలితంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా... ఇద్దరు గాయపడ్డారు.

ఆనందం విషాదమైంది..

By

Published : Jun 21, 2019, 5:05 PM IST

ఆనందం విషాదమైంది..

సూర్యాపేట జిల్లా చిలుకూరులో మిట్స్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు కామినేని హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హుజూర్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

దర్గాకు వెళ్లి వస్తుండగా...

ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మహబూబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కోదాడలో శుభకార్యానికి వచ్చి అక్కడ కార్యక్రమం అయిపోగానే జాన్​పహాడ్ దర్గా వెళ్లారు. అక్కడి నుంచి హుజుర్​నగర్ వచ్చి.. అక్కడి నుంచి ఆటో కిరాయికి తీసుకొని కోదాడలో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు.

డ్రైవర్ అతివేగమే కారణం..

ఉదయం 7 గంటల సమయంలో చిలుకూరు వద్ద ఆటో మరో వాహనాన్ని ఓవర్​ టేక్ చేయబోతున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఫలితంగా ఆటోలో ఉన్న ఎనిమిది మంది ఎగిరి రోడ్డు మీద పడటంతో ఎదురుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులు అఫ్జల్ పాషా(50), మహిముద్ బేగం(33), గౌసియా బేగం(40), మహిన్(15), ముస్కాన్(11), మహబూబ్ పాషాగా గుర్తించారు. గాయపడ్డ జకీర్, నాగుల్ మీరా హుజుర్​నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు సందర్శించారు. బంధువుల రోదనలతో కోదాడ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. ఆటో డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

ఇవీ చూడండి: లారీని ఢీకొట్టిన బస్సు- 30 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details