సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురానికి చెందిన దగ్గుబాటి కీర్తన నడిగూడెంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం బడిలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా... అక్కడ వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. ఈ ప్రమాదంలో శరీరం 80 శాతం కాలిపోగా... చిన్నారి బతకటం కష్టమేనని వైద్యులు చెప్పారు. చివరకు హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చేర్పించగా... ఇన్‌ఫెక్షన్ సోకిందన్న వైద్యులు కీర్తన రెండు చేతులను తొలగించారు. గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కమార్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య సహకారంతో.. ఎట్టకేలకు చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ చేతులు కోల్పోవటం... భర్తకు లోకజ్ఞానం లేకపోవటం వల్ల కుటుంబ భారం తల్లిపై పడింది. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తుండగా విధి వక్రీకరించి వారి కుటుంబంలో ఆవేదన నింపింది. రెండు చేతులు లేనందున కీర్తన ఏ పనీ చేసుకోకపోవటం వల్ల నాటి నుంచి తల్లి నాగరాణి ఇంటి వద్దే ఉంటూ కీర్తనను చూసుకుంటుంది. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆమెకు ప్రభుత్వం నుంచి పింఛన్ కూడా అందటంలేదు. చిన్నారి మందుల ఖర్చుల కోసం ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేశారు.