కొమ్మల మధ్య గెంతుతూ.. ఆకుల నడుమ ఊగుతూ.. రెప్పపాటులో మాయమయ్యే ఉడుతను ఇష్టపడనివారుండరు. చప్పున వినపడగానే.. చప్పున పారిపోయే ఉడుతను పట్టుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఊచ్ అనగానే తుర్రుమనే ఉడుత ఆ ఇంట్లో ఓ సభ్యురాలిగా కలిసిపోయింది. కొమ్మలమీద గెంతే ఉడుత.. వారి భుజాలపై ఆడుతూ.. చేతులపై తిరుగుతూ ఉంటుంది. కాయలు, ధాన్యాలు తినే ఉడుత.. ఆ ఇంట్లో పాలు, పళ్లు, అన్నము తింటుంది. సహజంగా జంతు ప్రేమికులు కుక్కులను, పిల్లులను, పక్షులను పెంచుతుండడం మనమందరం చూసుంటాం. కానీ సూర్యాపేట జిల్లా జనగామ కూడలి వద్ద ఉంటున్న ఓ కుటుంబం ఉడుతను పెంచుకుంటున్నారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానికి భావిస్తున్నారు.
ఇంతకీ ఆ ఉడుత ఎలా వచ్చిందంటే..
జనగా సెంటర్లో టీస్టాల్ నడుపుతున్న దంపతుల కుమారుడు అస్లాం ఏడోతరగతి చదువుతున్నాడు. అస్లాంకు చిన్ననాటి నుంచి జంతువులు, పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే ఓ రోజు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా.. ఓ చెట్టుపై నుంచి తీవ్రగాయాలతో కిందపడిన ఉడుతను చూశాడు. కాకుల దాడిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఉడుతపిల్లను చేరదీసి ఇంటికి తీసుకెళ్లాడు.
తీవ్రగాయాలపాలైన ఉడుత పిల్లను బతికించమని తల్లిని కోరాడు. అది బతకదని వదిలేయమని చెప్పినా.. వినలేదు. కుమారుడి బాధను చూసి ఆ ఉడుతపిల్ల గాయాలకు పసుపురాసి.. ఆహారం పెట్టి ప్రాణం నిలబెట్టారు. కొన్ని రోజులకు అది కోలుకుని... ఆ ఇంట్లోనే ఉంటూ వారిలో ఒకరిగా కలిసి పోయింది.
ప్రత్యేక వసతి...
తమ కుటుంబంలోకి అతిథిగా వచ్చిన ఉడుతకోసం ఆ బాలుడు ప్రత్యేకంగా ఓ పెట్టెను తయారు చేయించాడు. ఆహారం తిన్న తర్వాత అది అందులోనే పడుకుంటుంది. ఆకలి వేసినప్పుడు అరుస్తుంది.. ఆపిల్, పాలు, అన్నం ఏది పెడితే అది తింటుంది. వారు ఎక్కడికి వెళ్లినా దానిని తీసుకెళ్లకుండా ఉండరు. వారిలో ఒకరిగా మసులుతున్న ఆ ఉడుతను విడిచి వారు ఉండరు.
పొద్దు మొదలయ్యేది దానితోనే..
ఆ ఉడుతను ఆ బాలుడు తలవద్ద పెట్టుకునే పడుకుంటాడు. ఉదయాన్నే లేచిన వెంటనే దానికి ఏమి కావాలో చూసిన తర్వాతే ఆ కుటుంబ సభ్యులు మిగతా పనులు చేసుకుంటారు. ఇంట్లో ఉన్న సమయాల్లో విడిచిపెడతారు.. అది వారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ.. చేతులపై గెంతుతూ.. భుజాల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది.