ఓట్లు, సీట్ల కోసమే సీఎం జిమ్మిక్కులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడితే...ఆయన పిట్టలదొర అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతి విమర్శలు చేశారు. తెరాస, కాంగ్రెస్ వల్లే హుజూర్ నగర్ వెనుకబాటుకు గురైందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పరస్పర విమర్శనాస్త్రాలతో ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది.
ప్రచారపర్వంలో హస్తం నేతలు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. పాలకవీడు మండల కేంద్రం నుంచి నేరేడుచర్ల, గరిడేపల్లి మీదుగా మఠంపల్లి వరకు రోడ్ షో కొనసాగింది. అన్ని చోట్లా ప్రసంగించిన రేవంత్ కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసమైనా పద్మావతిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
పట్టణంలో సైదిరెడ్డి ప్రచారం..
తెరాస అభ్యర్థి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ నేరేడుచర్ల మండలం రోళ్లవారి గూడెంలో ఓటర్లను కలిశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ నేరేడుచర్ల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.