తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2020, 6:06 AM IST

ETV Bharat / state

56 ఏళ్లపాటు 'సహకార' ఛైర్మన్​.. ఇప్పుడు మళ్లీ...

ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న నేటి రోజుల్లో ఏకంగా 56 ఏళ్లపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్​గా కొనసాగుతుండటం ఆయన పనితీరుకు నిదర్శనం. 85 సంవత్సరాల వయసులో కూడా సహకార సంఘాన్ని లాభాల బాటలో పయనింపజేస్తూ హౌరా అనిపిస్తున్నారు. ఉన్నంత కాలం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మరోమారు ఎన్నికల పోటీలో నిలుస్తున్నారు జొన్నలగడ్డ హనుమయ్య.

56 ఏళ్లపాటు 'సహకార' ఛైర్మన్​.. ఇప్పుడు మళ్లీ...
56 ఏళ్లపాటు 'సహకార' ఛైర్మన్​.. ఇప్పుడు మళ్లీ...

56 ఏళ్లపాటు 'సహకార' ఛైర్మన్​.. ఇప్పుడు మళ్లీ...

దేశాభివృద్ధిలో సహకార వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. సహకార వ్యవస్థ బలోపేతం కావాలంటే నిస్వార్థంగా సేవాభావంతో పని చేసే వారితోటే సాధ్యమవుతుంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్​గా గత 56 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ.. 85 సంవత్సరాల వయసులో కూడా జొన్నలగడ్డ హనుమయ్య నిస్వార్థంగా పని చేస్తూ సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపారు. జొన్నలగడ్డ హనుమయ్య గురించి చెబితే గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల 10 ఊర్ల రైతులు కూడా గొప్పగా చెబుతున్నారు.

దానధర్మాల్లో ప్రథమం:

ఖానపురం సొసైటీ పరిధిలో గోదాముల నిర్మాణానికి 1984లో తన సొంత స్థలాన్ని దానం చేసి నిర్మించారు హనుమయ్య. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు తన భూమిని దానం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక గ్రామాల్లో ఉన్న నిరుపేదలు శుభకార్యాల కోసం సొసైటీ పరిధిలో కల్యాణ మండపం నిర్మించాడు. రైతులకు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా గ్రామంలో పేదలకు స్వయం సమృద్ధి సాధించడానికి 70 మంది పేదలకు పాడి గేదెల కొనుగోలుకై ఒక్కొక్కరికి రూ. 50 వేల రుణం అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందిస్తూ తన ఉదారతను చాటుకున్నారు.

పదేళ్ల పాటు అవార్డులు..

ఖానాపురం సొసైటీ 1959లో ఏర్పడింది. అప్పటినుంచి 1987 వరకు దాదాపు 28 ఏళ్లు ఛైర్మన్​గా హనుమయ్య వ్యవహరించారు. మళ్లీ 1992 నుంచి నేటి వరకు కొనసాగుతున్నారు. పదేళ్ల క్రితం నూతన సొసైటీ భవనాన్ని నిర్మించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపారు. జొన్నలగడ్డ హనుమయ్య దాదాపు పది సంవత్సరాల పాటు ఖానాపురం సహకార సంఘానికి ఉత్తమ సొసైటీగా అవార్డులను తీసుకొచ్చారు. ప్రస్తుతం 85 సంవత్సరాల వయసులో కూడా ఎన్నికల బరిలో నిలిచి హౌరా అనిపిస్తున్నారు.

ఇవీ చూడండి:'5 నిమిషాలు రైతుల గురించే చర్చించే సమయం దొరకలేదా..?'

ABOUT THE AUTHOR

...view details