హైఅలర్ట్ కొనసాగుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో... అధికారులు కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జిల్లా అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి... కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. హోల్సేల్ మార్కెట్లను అందుబాటులోకి తేవడం ద్వారా... ఇబ్బందులు లేకుండా చూడొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. హోల్సేల్ దుకాణాల ద్వారా అన్ని ప్రాంతాలకు సరకుల్ని సరఫరా చేయాలని... మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు.
సంచార బజార్లు..
సూర్యాపేట పురపాలికలో సంచార బజార్ల ద్వారా అమ్మకాలు చేపట్టాలని తీర్మానించారు. హోల్సేల్ దుకాణాల కోసం... ఎస్వీ డిగ్రీ కళాశాలతోపాటు కిరాణ వర్తక సంఘం ఫంక్షన్ హాలు అనువైనదిగా భావించారు. వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ.. ఔషధాలు అవసరమైన వారికి... ఇంటింటికి సరఫరా చేసేందుకు వీలుగా 22 దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... ప్రత్యేక కమిటీని నియమించారు. డీఎస్పీ, పురపాలిక కమిషనర్, ఫుడ్ ఇన్సిపెక్టర్, డ్రగ్ ఇన్సిపెక్టర్, పురపాలిక ప్రత్యేకాధికారితో కూడిన బృందం... కార్యకలాపాలు పర్యవేక్షించనుంది.
ఒక్క సూర్యాపేటలోనే 54 కేసులు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి మినహా... నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 98 కొవిడ్- 19 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 83 మందికి పాజిటివ్ రాగా... కేవలం సూర్యాపేట పట్టణంలోనే 54, ఆత్మకూరు(ఎస్) మండలంలో 15, తిరుమలగిరిలో 7, నాగారం మండలంలో 6, నేరేడుచర్లలో ఒక కేసు నమోదయ్యాయి.