YS Sharmila challenged KCR: రాష్ట్రంలో సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతా.. సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసి క్షమాపణలు చెప్పి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి అని ఆమె ఛాలెంజ్ చేశారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మెదక్ నియోజకవర్గం నుంచి దుబ్బాక నియోజకవర్గం చేగుంట వరకు కొనసాగింది. చేగుంటలో భారీ బహిరంగ సభలో మాట్లడిన ఆమె దుబ్బాక నియోజకవర్గానికి వైఎస్సార్ ఎంతో చేశారని గుర్తుచేశారు.
కేసీఆర్ దుబ్బాక ప్రజలకు చెవిలో పూలు పెడితే.. రఘునందన్ క్యాలీఫ్లవర్ పెట్టారు: మంజీరా నీళ్లతో దుబ్బాకలో తాగునీటి కష్టాలు తీరవని అన్నారు. నియోజకవర్గంలో డిగ్రీకాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఇలా అన్ని వైఎస్సార్ ఇచ్చినవి గుర్తు చేశారు. దుబ్బాకలో ఆరు సంవత్సరాలు తెరాస ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు భాజపా ఎమ్మెల్యే రెండేళ్లుగా ఉన్నారు. ఆరేళ్లుగా కేసీఆర్ దుబ్బాక ప్రజలకు చెవిలో పూలు పెడితే.. భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని ఆమె ఎద్దేవా చేశారు.
భాజపా కండువ కప్పుకున్న తెరాస నాయకుడు రఘునందన్: మల్లన్న సాగర్ బాధితులకు రఘునందన్ ఇచ్చిన హామీ నెరవేర్చారా అని ఆమె ప్రశ్నించారు. 11 గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగిందని నేను న్యాయం చేస్తానని రఘునందన్ రావు చెప్పి రెండింతలు పరిహారం ఇప్పిస్తానని పరిహారం ఇప్పించక పోతే రాజీనామా చేస్తానని అన్నారు. ఇప్పటికీ పరిహారం ఇప్పించలేదు.. రాజీనామా చేయలేదన్నారు. ఎన్నికల్లో దుబ్బాకలో ఆసుపత్రి కడతామని హామీ ఇచ్చారు. కానీ ఆసుపత్రి అమీర్‌పేట్‌లో కట్టారు. దాని ప్రారంభోత్సవానికి హరీష్‌రావు వచ్చారని... రఘునందర్ రావు ఉండేది భాజపాలోనా తెరాసలోనా అని ఆమె ప్రశ్నించారు.