గజ్వేల్ పట్టణంలోని పాత ప్రభుత్వ దవాఖానా స్థలంలో కార్పొరేట్ తరహాలో మాతాశిశు వైద్యం కోసం రూ.31.69 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సంరక్షణ ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం పాత భవనాన్ని కూల్చివేసేందుకు ప్రక్రియ మొదలయింది.
తొలినాళ్లలోనే..
గజ్వేల్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఇక్కడ కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2015లో పాత ప్రభుత్వ ఆస్పత్రిలో కోటి వ్యయంతో హైరిస్క్ ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 2018లో కొత్త భవనంలోకి మార్చారు.
ఒక్కో పేద కుటుంబానికి దాదాపు రూ.25 వేల ఖర్చు భారం తగ్గనుంది. కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైన తర్వాత ఇక్కడ సాధరణ ప్రసవాలు మరింతగా పెరిగాయి. రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు అందుతున్నాయి.
ఈనాడు కథనంతో..
ఈఎంసీఎచ్ అందుబాటులోకి వస్తే మాతాశిశువుకు కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన 100 పడకల జనరల్ ఆస్పత్రిలోనే సేవలు పొందుతున్నారు. గతంలో పనులు ప్రారంభం కాకపోవడంతో 'ఈనాడు దినపత్రిక'లో 'గజ్వేల్లో ఎంసీహెచ్ ఏ మాయే' అనే శీర్షికతో 2019 జూలైలో కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత అధికారులు ఈ ప్రాజెక్టును త్వరగా పట్టా లెక్కించాలని కృషి చేస్తూ వస్తున్నారు.
ఇదీ చూడండి:దిగ్విజయంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స