సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిస్తున్న వైకుంఠధామం... అక్రమంగా తమ స్థలంలో నిర్మిస్తున్నారని పలువురు మహిళా రైతులు పనులను అడ్డుకున్నారు. ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించిన సమయంలో తమ అ వ్యవసాయ స్థలంలోకి రావద్దని సదరు కాంట్రాక్టర్లకు, అధికారులకు తెలుపగా.. రామని చెప్పారని మహిళలు తెలిపారు. పొద్దున పూట చేస్తే అడ్డుకుంటున్నామని... రాత్రుళ్లు పనులు చేయిస్తూ భూ హద్దులు దాటి వైకుంఠధామం నిర్మిస్తున్నారని ఆరోపించారు.
వైకుంఠధామం నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళా రైతులు - husnabad news
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను మహిళారైతులు అడ్డుకున్నారు. రాత్రుళ్ల పనులు చేస్తూ తమ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. తమ భూమిలోకి ప్రవేశించి తన భర్త సమాధిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్ల క్రితం మినీ స్టేడియం నిర్మాణం విషయంలో తమ భూమిని ప్రభుత్వం ఆక్రమిస్తోందని హైకోర్టులో కేసు వేయగా స్టే ఇచ్చారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు తమ భూమిలోకి వైకుంఠధామం నిర్మాణం పేరుతో అక్రమంగా ప్రవేశిస్తున్నారని మండిపడ్డారు. వైకుంఠధామం నిర్మాణం పేరిట పురాతన సమాధులను తొలగించారని, ఇప్పుడు తమ భూమిలోకి ప్రవేశించి తన భర్త సమాధిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళా రైతు సువార్త ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్.. బాధిత మహిళా రైతుకు నచ్చజెప్పారు. తన భర్త సమాధిని తొలగించమని హామీ ఇచ్చారు. మహిళా రైతుల వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి కొంతవరకు వైకుంఠధామం నిర్మాణ పనులు చేపట్టారని... వారి కోల్పోయిన స్థలానికి సమానంగా పక్కనే మరో రెండు గుంటల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.