తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ మహిళలు స్వయం కృషితో బ్రాండ్ సృష్టించారు! - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

వాళ్లంతా... ఏ కూలీ పనికో వెళ్లి వందో... రెండొందలో పంచుకునేవారు. కానీ.. ఎంతకాలం అలా? తమకంటూ ఓ ఆధారమే ఉండొద్దా... అనుకున్నారు. తలా ఇరవై వేలు పోగేసి పప్పులు తయారుచేస్తూ ఎదిగారు. తమ గ్రామం పప్పులకు బ్రాండ్‌ విలువను సృష్టించారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో మహిళలు ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు.

ఆ మహిళలు స్వయం కృషితో బ్రాండ్ సృష్టించారు!
ఆ మహిళలు స్వయం కృషితో బ్రాండ్ సృష్టించారు!

By

Published : Jul 17, 2020, 3:01 PM IST

ఆ మహిళలు స్వయం కృషితో బ్రాండ్ సృష్టించారు!

మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో డబ్బు దాచుకోవడం ఒక్కటే కాదు. ఆ పైసల్ని పెట్టుబడిగా ఎలా మలచాలో, వ్యాపారంగా ఎలా తీర్చిదిద్దాలో కూడా తెలియాలి. దీనికి చక్కని ఉదాహరణగా.. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి మహిళలు. శ్రీవల్లి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మిట్టపల్లి యూనిట్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. తలా 20 వేల రూపాయల పెట్టుబడితో మొదలైన వీరి యూనిట్‌కు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తన వంతు ప్రోత్సాహం అందించారు. మిట్టపల్లి గ్రామ సర్పంచ్‌ వంగ లక్ష్మీనర్సింహారెడ్డి లక్ష రూపాయలు ఇవ్వగా... స్థానికులు మరికొంత తోడ్పాటునందించారు. బ్యాంక్‌ ద్వారా 10 లక్షలు రుణం తీసుకొని యంత్రాలు కొనుగోలు చేసుకుని ఓ అద్దె భవనంలో ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

తిరుగులేని నాణ్యత..

కంది, శనగ, మినుము, పెసర్లతో నాణ్యమైన పప్పులను సిద్ధంచేస్తున్నారు. కిలో కందిపప్పు 80 రూపాయలు.. మినప్పప్పు 120, శనగ పప్పు 75 రూపాయలకు విక్రయిస్తున్నారు. నాణ్యతకు తిరుగులేకపోవడం వల్ల మిట్టపల్లి పప్పులకు బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడింది. దీంతో యూనిట్‌ను విస్తరించాలని భావించి... సిద్దిపేట రైతుబజార్​లో ప్రత్యేకంగా ఒక స్టాల్‌ ఏర్పాటు చేసి... మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా ప్రారంభించారు. ముందు సిద్దిపేట, తర్వాత తెలంగాణ, ఆ తర్వాత దేశమంతా... మిట్టపల్లి బ్రాండ్‌తో పప్పు విక్రయాలు జరిపేలా కసరత్తు చేస్తున్నారు.

ఇతర మహిళా సంఘాలకు ఆదర్శం..

ప్రాసెసింగ్‌లో భాగంగా కొనుగోలు చేసిన కందుల్ని 12 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టి శుభ్రం చేస్తారు. తర్వాత తాలు, మట్టి వేరుచేసి బాయిలర్‌లో వేసి బట్టీ పెడతారు. ఆ తర్వాత వాటిని ఆరబెట్టి గోనె సంచుల్లో నింపి రోలింగ్‌ మెషీన్‌లో పోస్తారు. బయటకు వచ్చిన తరువాత వాటికి ఆయిల్‌ రుద్ది పొట్టు తొలగిస్తారు. సుమారు 18 గంటల పాటు ఆరబెట్టిన తర్వాత యంత్రం సాయంతో పప్పును సిద్ధం చేస్తారు. చివర్లో నాణ్యమైన పప్పును ప్యాకింగ్‌ చేస్తారు. క్వింటాల్‌ కందుల నుంచి సరాసరి 75 కిలోల పప్పు తీస్తారు. మిట్టపల్లి బ్రాండ్‌ పేరిట పప్పులను తయారు చేయడం సంతోషంగా ఉందని... ఇందుకు సహకరించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఖర్చులు, రాబడి ప్రతీది రికార్డు చేసుకుంటున్నారు. ఆదాయంలో నుంచి బ్యాంకు అప్పు చెల్లిస్తూ... ఉపాధి పొందుతున్నారు. ఇతర మహిళా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవీ చూడండి:కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ABOUT THE AUTHOR

...view details