తెలంగాణ

telangana

ETV Bharat / state

చెప్పులు లేకుండా పరుగెత్తింది.. మహిళా సత్తా ఎలుగెత్తింది - Woman Farmer 5km running

Woman Formar Running: ఆమె పరుగుకు జనం సలాం కొట్టారు. రాజకీయ, ప్రభుత్వ అధికారులు మంత్రముగ్ధులయ్యారు. తోటివారు ఆశ్చర్యపోయారు. 30 ఏళ్లు పైబడిన మహిళ తన అసాధారణ పరుగుతో అందర్ని ఆకట్టుకుంది. గట్టిగా అనుకోవాలే గాని మనిషి సాధించనిది ఏదీ లేదంటూ మరోమారు నిరూపించింది. వయసుతో సంబంధం లేకుండా పరుగెత్తి... సంకల్పం ఆయుధమైతే విజయం వరిస్తుందని ఎలుగెత్తింది. యువతీయువకులే నీరసపడిపోయే 5కే రన్నింగ్​లో ఎలాంటి సాధనలేని ఓ నిరుపేద మహిళా రైతు చెప్పులు లేకుండా ఉత్త కాళ్లతో 5కిలోమీటర్లు పరిగెత్తి... వావ్ అనిపించింది. అందరికీ స్ఫూర్తినిచ్చింది.

woman
woman

By

Published : Jun 2, 2022, 8:15 AM IST

Updated : Jun 2, 2022, 11:06 AM IST

చెప్పులు లేకుండా పరుగెత్తింది.. మహిళా సత్తా ఎలుగెత్తింది

Woman Farmer Running: సంకల్పబలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ నిరుపేద మహిళా రైతు. సుమారు 500 మంది మహిళలు పాల్గొన్న 5 కిలో మీటర్ల పరుగు పోటీలో ఎలాంటి పాదరక్షలు ధరించకుండా వట్టి కాళ్లతో పరుగెత్తి విజేతగా నిలిచి ఔరా అనిపించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లు పైబడిన మహిళలకు 5 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహించారు.

రన్నింగ్ విజేతలు

ఈ పోటీలో హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మల్లంపల్లికి చెందిన మల్లం రమ అనే మహిళా రైతు ప్రథమ విజేతగా నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ప్రథమ విజేతగా నిలిచిన మహిళా రైతు మల్లం రమను స్థానిక ఎమ్మెల్యే సతీశ్​కుమార్, సీపీ శ్వేత అభినందించి ప్రథమ బహుమతిగా రూ. లక్ష నగదును అందించారు. పరుగు పోటీలో పాల్గొనడానికి మహిళా రైతు రమ ఎలాంటి సాధన చేయలేదు. గ్రామంలో ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ వ్యవసాయ బావి వద్దకు రోజూ గేదెలను తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడమే ఆమెకు సాధన అయింది.

పరిగెత్తుతున్న రమ

కుమారుల చదువు కోసం: హుస్నాబాద్​లో పరుగు పోటీ ఉందని తమ గ్రామంలోని మహిళా సంఘాల సీఏ తనను తీసుకు వచ్చిందన్న విజేత రమ... పరుగు పోటీలో పాల్గొని విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. భర్త, ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. బహుమతిగా వచ్చిన రూ. లక్షను తన కుమారుల చదువుకు వినియోగిస్తానని రమ తెలిపారు. పరుగు పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి విజేతగా నిలిచిన తనకు నగదు బహుమతిని అందించిన స్థానిక ఎమ్మెల్యే సతీశ్​ కుమార్, సీపీ శ్వేతకు ధన్యవాదాలు తెలిపారు.

అందరికి స్ఫూర్తి:5 కిలోమీటర్ల పరుగు పోటీలో మహిళ రైతు రమతో పాటు రెండు, మూడు స్థానాల్లో సైతం మహిళ రైతులే విజయం సాధించడం విశేషం. పాదరక్షలు ధరించి సాధన చేసి కూడా యువతి యువకులే పరుగు పోటీల్లో పరుగెత్త లేక పోతున్న నేటి రోజుల్లో 30 ఏళ్లకు పైబడిన ఈ మహిళా రైతులు పరుగెత్తి విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

లక్ష రూపాయల నగదు అందుకున్న రమ

ఇదీ చూడండి..

Last Updated : Jun 2, 2022, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details