ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం. తండ్రి లేని లోటును పిల్లలకు తెలియకుండా వారిని చదివిస్తూ, వ్యవసాయ పనుల్లో అన్నీ తానై చూసుకుంటుంది ఆ మహిళా రైతు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్‌కు చెందిన కావేటి శివ రాజమ్మ భర్త ఏడాది క్రితం మరణించాడు. భర్త మరణించాక మొక్కవోని ధైర్యంతో తనకున్న మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంది.
పంట పొలంలో కలుపు తీయడం, మందు చల్లడం, నీటిని మళ్లించడం ఇలా అన్ని పనులు తానే చేసుకుంటుంది. మంచి, చెడు అన్నీ తానై ఇద్దరు పిల్లల్ని చదివిస్తుంది. ఆమెకున్న మూడెకరాల భూమిలో వివిధ రకాల పంటలను పండిస్తూ.. వ్యవసాయమే తమ బతుకుదెరువు అంటుంది రాజమ్మ.