సీఎం కేసీఆర్ సూచనల మేరకు వంటిమామిడి మార్కెట్ విస్తరణతో పాటు.. ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు వంటిమామిడి మార్కెట్ నుంచే కూరగాయలను సరఫరా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యచరణను సిద్ధం చేయాలని వారికి సూచించారు. మార్కెట్లో భద్రత ఏర్పాట్లపై సీపీతో చర్చించారు.
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.