మల్లన్న సాగర్ జలాశయం నుంచి మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు తాగునీరు అందించే ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను మే నెలాఖరులోగా పూర్తిచేయాలని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంజినీర్లను ఆదేశించారు. కొండపాక మండలం తిప్పారం, సింగారం గ్రామాల్లో చేపడుతున్న ఇన్‌టేక్‌వెల్ పనులు, మంగోల్‌లో జరుగుతున్న మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల ప్రగతిని ప్రతీరోజు సమీక్షించాలని ఇంజినీర్లకు సూచించారు.
సిద్దిపేట జిల్లా కోమటిబండలోని మిషన్ భగీరథ ప్లాంట్ క్యాంపస్.. కార్పొరేట్ కార్యాలయం కంటే బాగుందని స్మితా సబర్వాల్ కితాబిచ్చారు. ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఈఎన్సీ కృపాకర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అక్కడ ఆవరణలో మొక్కలు నాటారు. నాలెడ్జ్ సెంటర్‌ను సందర్శించారు. కోమటి బండ ప్లాంట్, పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఈఈ రాజయ్యకు సూచించారు.