కరోనా వ్యాప్తిని నివారణకు లాక్డౌన్ పాటించాలన్న ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ఇతర ప్రాంతాల వారు తమ గ్రామాల్లో ప్రవేశించకుండా గ్రామ సరిహద్దుల్లో ముళ్లకంప, రాళ్లు, డ్రమ్ములతో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో స్వీయ నిర్బంధం పాటిస్తున్న గ్రామాలు
కరోనా నివారణకు సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. యువకులు, పెద్దలు కలిసి గ్రామాల పొలిమెరల్లో కంచెలు ఏర్పాటు చేసి ఇతరులను గ్రామాల్లోకి రానివ్వకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. గ్రామాల పరిధిలో సరిహద్దుల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వేరే ప్రాంతాల వారిని అడ్డుకుంటున్నారు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల, కుచనపల్లి, కోహెడ మండలంలోని వరికోలు, శనిగరం, తంగళ్లపల్లి, అక్కన్నపేట తదితర గ్రామాల్లో ప్రజలు వేరే ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. వాహనాదారులను చెక్ చేసి పంపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప గ్రామస్థులను ఇతర ప్రాంతాలకు పంపించడం లేదు.
ఇదీ చదవండి:దేశంలో 500కు చేరువలో కరోనా కేసులు