ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నేలపాలు అవుతుంటే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు తీవ్ర మనోవేదనకు దుఃఖానికి గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతం, నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని పలు తండాలలో గిరిజన రైతులు. ఈ యాసంగిలో అధిక శాతం వరి పంటను వేశారు. అయితే పంటలు వేసే సమయంలో చెరువుల్లో కుంటల్లో బావుల్లో సమృద్ధిగా నీరు ఉంది. కానీ పంట చేతికి వచ్చే చివరి ఈ నెల రోజుల్లో చెరువుల్లో కుంటల్లో బావుల్లో నీరు అడుగంటి పోవడంతో రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి.
అక్కన్నపేట మండలం చాపగాని తండాలో సుమారు 80 ఎకరాల వరకు గిరిజన రైతులు ఈ యాసంగి లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం వరి పంటకు సాగునీరు అందించడానికి ఆధారమైన బావుల్లో నీరు అడుగంటి పోయి, పంటకు నీరు అందక కళ్ల ముందే వరిపైరు ఎండిపోతుంటే గిరిజన రైతులు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. అప్పులు తీసుకు వచ్చి ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంటలు ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.