సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు ఇక రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ఇక్కడి ప్రజల దశాబ్దాల కల నెరవేరేందుకు ఇక అడుగు దూరం మాత్రమే మిగిలింది. దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ జోన్ సేఫ్టీ కమిషనర్ శ్రీరామ్‌క్రిపాల్ ఆధ్వర్యంలో రైల్వే ఇంజినీర్ల బృందం బుధవారం తనిఖీలు చేపట్టింది. గజ్వేల్ స్టేషన్ నుంచి మనోహరాబాద్ మధ్య గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడపగా ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. రైల్వే సేవలు ప్రారంభించేందుకు ముహూర్తమే మిగిలింది.
గజ్వేల్-మనోహరాబాద్ మధ్య రైలు సేవలను త్వరలో ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ జోన్ సేఫ్టీ కమిషనర్ శ్రీరామ్‌క్రిపాల్ తెలిపారు. మనోహరాబాద్- కొత్తపల్లి మధ్య చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం గజ్వేల్ వరకు పూర్తయిందన్నారు. రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు.