తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 5:42 AM IST

ETV Bharat / state

కాళేశ్వరం మొత్తం నిర్మాణ వ్యయం రూ. 1,10,000 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం సుమారు రూ.లక్షా పదివేల కోట్లకు చేరనుంది. గతేడాది మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులను ప్రభుత్వం చేపట్టగా.. మూడో టీఎంసీ కోసం ఖర్చు పెరిగింది. తాజా ధరలతో సవరించిన అంచనా కావాలని కేంద్ర జలసంఘం సూచించడంతో నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోన్నట్లు తెలిసింది.

total cost for construction of kaleswaram project
కాళేశ్వరం మొత్తం నిర్మాణ వ్యయం రూ. 1,10,000 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం సుమారు రూ.లక్షా పదివేల కోట్లకు చేరనుంది. మొదట రెండు టీఎంసీల నీటి మళ్లింపు లక్ష్యంకాగా.. గత ఏడాది అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులను ప్రభుత్వం చేపట్టింది. వీటన్నింటికి కలిపి నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. పెట్టుబడి అనుమతి కోసం ప్రతిపాదనలు పంపేందుకు తాజా ధరలతో సవరించిన అంచనా కావాలని కేంద్ర జలసంఘం సూచించడంతో నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోన్నట్లు తెలిసింది.

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కోసం

కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి ఒక టీఎంసీ నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా కాళేశ్వరం నుంచి రోజుకు రెండు కాకుండా మూడు టీఎంసీలు మళ్లించేలా పనులు చేపట్టాల్సి వచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు అదనపు టీఎంసీ పనుల కోసం సుమారు రూ.4,500 కోట్లు ఖర్చయినట్లు తెలిసింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.11,806 కోట్లతో, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు రూ.11,710 కోట్లతో మూడో టీఎంసీ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇలా కొత్తగా చేపట్టినవి, గతంలో చేసిన పనులకు ప్రైస్‌ ఎస్కలేషన్‌, పెరిగిన భూసేకరణ, పునరావాస వ్యయం కలిపి సుమారు రూ.లక్షా పదివేల కోట్లకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తుది అంచనాలు ఖరారయ్యేటప్పటికి కొంత మార్పు జరిగే అవకాశం ఉంది.

ఇప్పడు అంచనాలు కోరడం ఆశ్చర్యం: నీటిపారుదల శాఖ వర్గాలు

2018 జూన్‌లో పెట్టుబడి అనుమతి కోసం కేంద్రానికి నివేదిస్తే, ప్రాజెక్టులో అత్యధిక భాగం పనులు పూర్తయిన తర్వాత సవరించిన అంచనా కోరడం ఆశ్చర్యంగా ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్లకు పునరాకృతి చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం 2016లో శ్రీకారం చుట్టింది. 225 టీఎంసీల నీటి వినియోగంతో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.75 లక్షల ఎకరాల స్థిరీకరణతో పాటు పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్‌కు తాగునీరివ్వడం ఈ పథక లక్ష్యం. ఇందుకోసం రూ.80,190 కోట్లకు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ 2018 జూన్‌ ఆరున ఆమోదం తెలిపింది. 2015-16 ధరల ప్రకారం ఈ అంచనాను ఖరారు చేసింది.

వెంటనే పెట్టుబడి అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అనుమతి వస్తే కేంద్రం ఆర్థిక సాయం అందించడానికి వీలవుతుంది. అప్పటి నుంచి దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప పెట్టుబడి అనుమతి లభించలేదు. ఈ నెల 11న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌కు రాసిన లేఖలో 2019-20 అంచనాల ప్రకారం కాళేశ్వరం అంచనా వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి తెప్పించాలని కోరారు. మామూలుగా అయితే రెండేళ్ల ముందు కాలం వరకు ఆమోదించిన అంచనాను పెట్టుబడి అనుమతి కోసం పరిగణనలోకి తీసుకుంటామని, ఈ ప్రాజెక్టుకు 2015-16 ధరలతో ఆమోదించినందున నాలుగేళ్లయ్యిందని, దీనిని పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలు అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు.

తాజా అంచనాలు పంపితే మళ్లీ జలసంఘం పరిశీలించాలి. దీనివల్ల జాప్యం తప్ప ఇప్పటికిప్పుడు పెట్టుబడి అనుమతి వచ్చే అవకాశమేమీ లేదని నీటిపారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రజలసంఘం డైరెక్టర్‌ ముఖర్జీ ఈ నెల 19న కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు రాసిన లేఖలో తాజా అంచనాలు కోరినట్లు తెలిసింది. అదనంగా చేపట్టిన పనుల వల్ల రూ.లక్షా పదివేల కోట్లకు అంచనాలు చేరినందున కాస్ట్‌ బెన్‌ఫిట్‌ రేషియోతో సహా అన్నీ మారిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details