ఇంటి పట్టునే సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం ప్రారంభిస్తే ఇంటిల్లిపాది సమతుల్యమైన ఆహరం తీసుకోవడం సులభసాధ్యమౌతుందని భావించారు. అనుకున్నదే తడవుగా ఇంటిపైన మిద్దె తోటలను ప్రారంభించారు. కాయగూరలు, పండ్లు పండిస్తూ... అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు సిద్దిపేటకు చెందిన పలువురు ఉద్యోగులు.
యూట్యూబ్లో చూసి...
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి రసాయనాలు లేని ఆహారాన్ని సంపాదించుకోవాలని పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు నాగరాజు, రవీందర్ రెడ్డి, సూర్య ప్రకాశ్, వైద్యులు స్వామి తదితరులు కలిసి మిద్దె తోటలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రధానంగా కూరగాయలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నారు. తోటను ఎలా ఏర్పాటు చేయాలో యూట్యూబ్లో పలు వీడియోలు చూశారు. మొక్కల పెంపకాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వహిస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా కుండీలు నిర్మించి అందులో మట్టిపోసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మరికొంత మంది డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు.