Harish Rao on central minister tomar: సాగుచట్టాలు మళ్లీ తీసుకొస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సాగుచట్టాలు వెనక్కి తీసుకుంటున్నామంటూ... రైతులకు ప్రధాని క్షమాపణలు సైతం చెప్పాక, మళ్లీ తెస్తామంటూ తోమర్ మాట్లాడటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవంలో హరీశ్ పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించారు.
సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పుడేమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.. సాగు చట్టాలను తీసుకువస్తామని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని స్పష్టత ఇవ్వాలి. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే రద్దు ప్రకటన చేసినట్లుగా అనిపిస్తోంది. సాగు చట్టాల విషయంలో రైతులను బాధపెట్టినందుకు వారికి కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పాలి.-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి