తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ)కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. దేశంలోని అటవీ కళాశాలల ప్రమాణాలు, వసతుల్ని అధ్యయనం చేసిన ఇండియన్ ఫారెస్ట్ కౌన్సిల్.. ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న ఎఫ్‌సీఆర్‌ఐని ‘ఏ’ ప్లస్ కేటగిరి విద్యాసంస్థగా గుర్తించింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులను సీఎం కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందన్నారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 2016లో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీకోర్సుతో అటవీ కళాశాల ప్రారంభమైంది. 2019 నుంచి సిద్దిపేట రహదారిలోని ములుగులో నిర్మించిన సొంత క్యాంపస్‌లో కళాశాల నడుస్తోంది.
అటవీ కళాశాలకు ‘ఏ ప్లస్’ గుర్తింపు.. సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) కు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ఏ ప్లస్’ కేటగిరి విద్యాసంస్థగా ఇండియన్ ఫారెస్ట్ కౌన్సిల్ గుర్తించింది. దీనిపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఎఫ్‌సీఆర్‌ఐలో 2020-21 విద్యాసంవత్సరం నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీ, మూడేళ్ల పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సులను ప్రారంభిస్తున్నారు. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో ఈ కళాశాల ఒప్పందాలు కుదుర్చుకుంది. కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు రావడం గొప్ప విషయమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ నుంచి ఎక్కువమంది ఐఎఫ్‌ఎస్‌లను, అటవీ వృత్తినిపుణుల్ని తయారుచేసేలా కళాశాలను తీర్చిదిద్దుతామన్నారు. ఏ ప్లస్ గుర్తింపు రావడంతో తెలంగాణ అటవీ కళాశాలకు దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని, విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉందని కళాశాల డీన్ జి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!