సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నవంబరు 3న పోలింగ్ జరగనుంది. 1.98 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా, పారదర్శకంగా చేపట్టాల్సిన బాధ్యత అధికారులకు ఏర్పడింది. ఈ మేరకు వివిధ రూపాల్లో పోలింగ్ కేంద్రాలపై సాంకేతిక నిఘాకు సిద్ధమవుతున్నారు.
70 చోట్ల వెబ్‌కాస్టింగ్
నియోజకవర్గంలో 70 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేపట్టనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, ఎంపిక చేసిన యువతకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ల్యాప్‌టాప్, వెబ్‌కెమెరాల ద్వారా కేంద్రాల్లో దీన్ని చేపట్టనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ అంతర్జాల వ్యవస్థ ద్వారా ఈ కేంద్రాలను కలెక్టరేట్‌లోని వెబ్‌కాస్టింగ్ పరిశీలన కేంద్రం, హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానించనున్నారు. 70 కేంద్రాల్లో పోలింగ్‌ను ఈ మూడు చోట్లతెరలపై ఎన్నికల అధికారులు పరిశీలించే అవకాశం ఉంది.
- 113 పోలింగ్ కేంద్రాల్లో మానవ రహిత కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులు వీడియో రూపంలో ఈ కెమెరాల్లో నిక్షిప్తం కానున్నాయి.
- మరో 132 కేంద్రాల్లో కెమెరామెన్ల ద్వారా వీడియో చిత్రీకరణ చేయనున్నారు. వీలైతే వీటిలో కొన్నింట మానవ రహిత కెమెరాలు పెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- మొత్తం మీద వచ్చే నెల 3న పోలింగ్ కేంద్రాలన్నింటిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియపై సాంకేతిక కన్ను పెట్టనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కేంద్రాల్లో ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేయకుండా పారదర్శంగా ఓటింగ్ చేపట్టేందుకు ఇది ఉపయుక్తంగా మారనుంది.