అధికారమున్నా రోజువారి కూలి పనులకెళ్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్లు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని గుడాటిపల్లి, తోటపల్లి గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఉపాధి కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవలే గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన వీరు ఎప్పటిలాగానే రోజు వారీ కూలికి వెళ్తూ తాము... మట్టి మనుషులమని నిరూపించుకుంటున్నారు.
హుస్నాబాద్ మండలం తోటపల్లి సర్పంచ్ పోలవేని లత, ఉప సర్పంచ్ పద్మ జాతీయ ఉపాధిహామీ పథకం మొదలైనప్పటి నుంచి కూలి పనికి వెళ్తున్నారు. సర్పంచ్ భర్త సంపత్ కూడా ఈ పనికి వెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తామీ పనిచేస్తున్నామని, అధికారం వచ్చినంత మాత్రాన ఇలాంటి పనులు చేయడానికేం నామోషీ లేదని చెబుతున్నారు.
గౌరవెళ్లి ప్రాజెక్టులో గుడాటిపల్లి గ్రామం ముంపునకు గురవుతోంది. ఇళ్ళు, భూములన్నీ ప్రాజెక్టులో మునిగిపోనున్నాయి. గ్రామస్థులకు ఉపాధి కల్పించేందుకు కూలీ పనులు నడుస్తున్నాయి. ముంపు గ్రామం అయినందున ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనలు చేపట్ట పోవడం వల్ల చేసే పనేమీ లేక సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, ఉప సర్పంచ్ జరుకుల రేణుక కూలి పనులకు వెళ్తున్నారు. ఊరందరితో పాటే ఉపాధి హామీ పనులు చేస్తూ రోజు వారీ ఆదాయం పొందుతున్నారు.
పనుల నుంచి తిరిగొచ్చాక రెండు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గ్రామంలో చేపట్టాల్సిన తాగు నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. గౌరవెళ్లి గ్రామ ప్రథమ పౌరులు ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాస ప్యాకేజీ విషయాలను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఇవీ చూడండి: మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం