సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ‘బాతిక్’ చిత్రకారుడు యాసాల బాలయ్య బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. బాలయ్య బాతిక్ చిత్రకళా రంగంపై ఆరు దశాబ్దాలకు పైగా తనదైన ముద్రవేశారు. ఈ కళతో సిద్దిపేట ప్రాంతానికి వన్నె తెచ్చారు.
బతుకు చిత్రం ఆవిష్కరణ...
తెలంగాణ బతుకు చిత్రాలను అవిశ్రాంతంగా ఆవిష్కరించారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ జీవన నేపథ్యం ఇతివృత్తంగా ఆయన గీసిన బాతిక్ చిత్రాలకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన చిత్రకళా శిబిరాలతో పాటు అమెరికాలో సైతం వందకు పైగా చిత్ర ప్రదర్శనల్లో బాలయ్య పాల్గొన్నారు.
ప్రధాన వేదికల్లో...
సాలార్‌జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, కేంద్ర, రాష్ట్ర లలితకళా అకాడమీలు, లేపాక్షి ఎంపోరియం, చెన్నైలోని రీజనల్ సెంటర్, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మ్యూజియం తదితర ప్రధానమైన వేదికల్లో ఆయన కళ దర్శనమిస్తుంది. ‘సమాజంలో రక్షణ లేని స్త్రీ’ అనే చిత్రాన్ని చూసి దివంగత ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ బాలయ్యను అభినందించారు. ఉద్యోగరీత్యా బాలయ్య ఉపాధ్యాయుడు.