Gouravelli Project Expats Protest: రావణకాష్టంలా రగులుతోన్న గౌరవెల్లి ప్రాజెక్టు పరిహారం వివాదం Gouravelli Project Expats Protest: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ పనుల పునఃప్రారంభాన్ని నిర్వాసిత గ్రామాల ప్రజలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 14ఏళ్ల కిందట మధ్యమానేరు కుడికాల్వ ద్వారా 1.7టీఎంసీ నీటి నిల్వ కోసం పనులను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.29టీఎంసీలకు పెంచడంతో ముంపు మరింత పెరిగింది. దీంతో అసలు వివాదం ప్రారంభమైంది.
పోలీసులకు భూనిర్వాసితులకు మధ్య తోపులాట
ప్రాజెక్టు నిర్మాణంతో గుటాటిపల్లి, తెనుగుపల్లి, సోమాజితండతో పాటు పలు తండాలు ముంపునకు గురవుతున్నాయి. జలాశయం పనులు 85 శాతం వరకు పూర్తికాగా మిగతా పనులను రెండేళ్లుగా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. గుడాటిపల్లి వద్ద రెండు చోట్ల రహదారులు మూసివేసి కట్టను నిర్మించాల్సి ఉంది. ఈ పనులను పోలీసు బందోబస్తు మధ్య అధికారులు చేపట్టడంతో... గుడాటిపల్లి సోమాజితండా వాసులు ప్రాజెక్టు పనులను అడ్డుకోవడంతో పోలీసులకు భూనిర్వాసితులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది.
'మాకు పరిహారం ఇస్తామన్నారు. లక్షా 40 వేలు ఇస్తామని చెప్పారు. మాకు ఇవ్వాల్సిందే. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. పెళ్లికి ఉన్న పిల్లలు ఉన్నారు. బిక్షం ఎత్తుకునే పరిస్థితి ఉంది. 500 మంది ఉన్నారు. వాళ్లకు పెళ్లిలు ఎలా చేయాలి. కిరాయికి ఇచ్చే వాళ్లు కూడా లేదు. డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పారు. అది కూడా అందలేదు. మాకు న్యాయం చేయండి. భూములకు సరైనా ధర కల్పించి మా డబ్బులు మాకు ఇప్పించండి.' - నిర్వాసితుల గోడు
వారికి సైతం పరిహారం ఇవ్వాల్సిందే..
Gouravelli Project conflict: ప్రాజెక్టు నిర్మాణంతో 937 మంది దాదాపు 3,500 ఎకరాల స్థలాన్ని కోల్పోతున్నారు. మరో 100 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంటుంది. పునరావాస ప్యాకేజీ కింద 8 లక్షల రూపాయల చొప్పున చెల్లించినప్పటికీ.. ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంతో.. అప్పుడు మైనర్‌గా ఉన్న 438 మంది ఇప్పుడు మేజర్ అయ్యారు. దీంతో కొత్తగా మేజర్ అయిన వారికి కూడా పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌తో... ఆందోళనను కొనసాగిస్తున్నారు.
'5 రోజుల నుంచి ఇక్కడే మేము పోరాటం చేపట్టాం. ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 1000 డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తామన్నారు. ఇచ్చే దాక మేము పోరాటం చేస్తాం. ఇవన్నీ చేస్తేనే గౌరవెల్లికి న్యాయం చేసినట్లు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుంది. నిలదీసే హక్కు ఉంది. ప్రశ్నిస్తే... గొంతుకలను నొక్కేస్తారా? ప్రాజెక్టు పనులను జరగనివ్వం.'
- చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
మరింత ముదిరిన వివాదం
Gouravelli Project Case in NGT: ఒకవైపు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు కొనసాగుతుండగా... తమ పరిహారం తేల్చకుండా పనులు ఎలా చేపడతారంటూ భూనిర్వాసితులు అడ్డుకోవడం.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో వివాదం మరింత ముదిరింది. నిర్వాసితులపై పోలీసుల దాడిని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. భూనిర్వాసితులు తమకు పరిహారం చెల్లించే వరకు.. ప్రాజెక్టు పనులను జరగనివ్వబోమని టెంట్ వేసుకుని వంటావార్పు చేసుకొని దీక్షకు పూనుకోవడంతో వివాదం జఠిలంగా మారింది.
ఇదీ చూడండి: Gouravelli project expats protest : ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు చేదు అనుభవం..