మిషన్ భగీరథ పథకం విజయవంతం కావడానికి కష్టపడిన ప్రతీ ఇంజనీర్‌కు గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండలోని మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్లో ఈ పథకంపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ పాల్గొన్నారు. మిషన్ భగీరథ పనులు ప్రారంభమైనప్పుడు తాను తెదేపా నాయకుడిగా ఉన్నట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాను ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు మిషన్ భగీరథ పథకం కారణమని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అధిక నిధులు తాగునీటికే ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.
మిషన్ భగీరథ పూర్తయిందని భారత ప్రభుత్వం ప్రకటించిందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. సుమారు 56 లక్షల ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు సరఫరా అవుతోందని తెలిపారు. ఈఎన్సీ నుంచి ఏఈల వరకు అందరూ చాలా నిజాయతీ, అంకితభావంతో పనిచేసి ఈ ఘనత సాధించారని అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు.. మంత్రి, స్మితా సబర్వాల్‌ను మెమెంటోలతో సత్కరించారు.
'గోదావరి, కృష్ణా జలాల ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం.. మిషన్ భగరీథను ఉత్తమ పథకంగా ప్రకటించింది. పథకం పనులపై పలు సమావేశాల్లో కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే రాష్ట్రానికి డబ్బులు ఇస్తారని భావించాం కానీ ఇవ్వలేదు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందించినందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నాం.'