Harishrao fires on Nirmala Sitharaman Comments: కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ వాస్తవాలు మాట్లాడితే కేంద్ర మంత్రులకు నిద్రపట్టడంలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చేసిన విమర్శలపై ఆయన ఎదురుదాడి చేశారు. కేంద్రం మాదిరిగా వడ్డీలు చెల్లించేందుకు తాము అప్పులు చేయటంలేదని... తెలంగాణ భావితరాలకు సంపద సృష్టిస్తున్నట్లు చెప్పారు.
అయిన కేంద్ర ప్రభుత్వాన్ని కాదని రాష్ట్ర సర్కార్ ఎక్కడా అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పూర్తి ఆధారాలతో మాట్లాడారన్నారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే ముందు నిర్మలాసీతారామన్ కేంద్రం అప్పుల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైద్యకళాశాలల ఏర్పాటుపై ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో విధంగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వేరే రాష్ట్రాలకు ఒక నీతి తెలంగాణకు ఒక నీతినా అని ప్రశ్నించారు.
అప్పులు పెరగడానికి కేంద్రమే కారణం :తెలంగాణకు రావాల్సి నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి నిధులను ఇచ్చి తెలంగాణకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులు పెరగడానికి కేంద్రప్రభుత్వమే కారణమని హరీశ్ ఆరోపించారు.