Ex MP Solipeta Ramachandra Reddy Died Today :మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి (92) చెందారు. అస్వస్థతతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
CM KCR Condolence to Former MP Solipeta :తొలి తరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట రామచంద్రారెడ్డి జీవితం.. అందరికీ ఆదర్శవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి.. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన ఆచరించిన కార్యాచరణ.. ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమలాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Harish Rao Condolence to Former MP Solipeta :రామచంద్రా రెడ్డి మరణం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి.. ప్రజల మన్ననలు పొందిన నేత సోలిపేట అని తెలిపారు. ఈ సందర్భంగా సోలిపేట కుటుంబసభ్యులకు హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోలిపేట మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.