IT Hub Inauguration in Siddipet Tomorrow : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే యువతలో ప్రత్యేకమైన క్రేజ్. ఇంజినీరింగ్ పూర్తి అవుతుండగానే.. విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ఐతే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలంటే మాత్రం ఉన్న ఊరిని, అయిన వాళ్లని వదలి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రథమశ్రేణి నగరాలకు వలస వెళ్లాల్సిందే. అయితే దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ సాఫ్ట్‌వేర్ కంపెనీలను తీసుకువస్తోంది.
Siddipet IT Hub Inauguration Tomorrow :ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లను నిర్మించింది. అక్కడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికే ఆయా నగరాల్లోని ఐటీ టవర్లలో పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా సిద్దిపేటలోనూ ఓ ఐటీ హబ్ నిర్మించింది రాష్ట్ర సర్కార్. ఈనెల 15వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావుతో కలిసి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు.
Siddipet IT Tower details: సిద్దిపేట శివారులో రాజీవ్ రహదారిపై సాఫ్ట్‌వేర్ కంపెనీల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించింది. సుమారు రూ.63కోట్లలతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇందుకోసం భవనాన్ని నిర్మించారు. పెద్ద పెద్ద నగరాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సౌకర్యాలు కల్పించారు. జీ+4 తరహాలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు.
- మొదటి అంతస్తులో కాఫీటేరియా, ప్రయోగశాల, సమావేశ గదులు, ఇంటర్వ్యూ గదులు ఉన్నాయి.
- రెండో అంతస్తులో క్యాబిన్లు, ఒపెన్ వర్క్ స్టేషన్లు, క్లోజ్డ్ వర్క్ స్టేషన్లు ఉన్నాయి. టాస్క్ శిక్షణ కేంద్రం సైతం ఇక్కడే ఉంది.
- మూడో అంతస్తులో టీఎస్ఐఐసీ కార్యాలయం, బోర్డు గదులు, వీహబ్, వర్క్ స్టేషన్లు ఉన్నాయి.
- నాలుగో అంతస్తులో సైతం వర్క్ స్టేషన్లు ఉన్నాయి.
- సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు
Siddipet IT Tower Facilities: సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. రెండు సంవత్సరాల పాటు నిర్వాహణ, అద్దె, విద్యుత్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లుల్లో ప్రభుత్వం మినహాయింపులు ఇస్తోంది. ఐటీ టవర్‌లోనే టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిరుద్యోగ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా శిక్షణ ఇవ్వనున్నారు.