ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడలేదు ఆగ్రామస్థులు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఎవరూ చెప్పనవసరం లేనప్పుడు.. ఊరుని శుభ్రంగా ఉంచుకోవాలని ఎవరైనా చెప్పాలా... గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచే ఓ సర్పంచ్ ఉంటే చాలు. గ్రామస్థుల్లో అవగాహన కల్పించి.. ఆలోచనను ఆచరణలో పెట్టి.. చెత్తపై పోరు జరిపి.. వ్యర్థమనుకున్న చెత్తను.. ఎంతో విలువైన ఎరువుగా మార్చి ఊరంటే ఇలా ఉండాలి అనే స్థాయికి తీసుకొచ్చారు మాల్యాల సర్పంచ్ దరిపల్లి వజ్రమ్మ. వ్యర్థానికి సరికొత్త రూపాన్నిచ్చి... దాన్ని ఎరువుగా మార్చి... మొక్కలకు అందిస్తూ... అటు శుభ్రతను... ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మాల్యాల గ్రామస్థులు. గ్రామంలో మొక్కలకే కాదు.. పొరుగు గ్రామాలకు ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో మల్యాల గ్రామం ‘స్వచ్ఛ మల్యాల' దిశగా అడుగులు వేస్తోంది. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ఉపాధిహామీ పథకం నిధులతో పాటు ప్రత్యేక అభివృద్ధి నిధులతో గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మించి.. చెత్త నుంచి సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేస్తున్నారు.
మంత్రి హరీశ్‌రావు చూపిన బాటలో...
గతంలో అన్ని గ్రామాల్లాగానే మా గ్రామంలోను చెత్త సమస్య విపరీతంగా ఉండేది. మంత్రి హరీశ్‌రావు సూచనలతో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు పూనుకున్నాం. గ్రామపౌరులందరికీ అవగాహన కల్పించి.. చెత్త నిర్వహణలో భాగస్వామ్యులను చేశాం. మా ఆలోచనకు మహిళా సంఘాలు తోడవడం వల్ల అనుకున్న లక్ష్యం సాధించాం. గ్రామంలో చెత్త అనేదే కనిపించకుండా చేస్తున్నాం. దరిపల్లి వజ్రమ్మ, గ్రామ సర్పంచ్.
స్వచ్ఛ మాల్యాల కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహన కల్పించాం. ప్రజల నుంచి ఇప్పటి వరకు సుమారు పది క్వింటాళ్ల ఎరువును తయారు చేశాం. మేము తయారు చేసిన ఎరువును ఇతర గ్రామాలకు కూడా ఇచ్చాం.
- హరీశ్, ఎంపీటీసీ సభ్యుడు