Siddipet Dinosaur Park Opening :సిద్దిపేట కోమటి చెరువు కోటి అందాలకు నెలవుగా మారింది. మంత్రి హరీశ్ రావు కృషితో ఆరు నెలలకోసారి ఏదో ఓ కొత్త అందం కోమటి చెరువుపై అవిష్కృతమవుతోంది. తాజాగా దేశంలోనే డైనోసార్ జురాసిక్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రోజున మంత్రి హరీశ్ రావు ఈ పార్కును ప్రారంభించారు.
Minister Harish Rao Inaugurate Siddipet Dinosaur Park :డైనోసార్ అరుపులు.. చీకటి గుహలు.. రాక్షస బల్లుల భీకర ధ్వనులు.. కోమటి చెరువుకు మరో సరికొత్త అందాన్ని చేకూర్చాయి. రాక్ గార్డెన్లో రాక్షస బల్లుల విన్యాసం.. కదిలే డైనోసార్లు.. భయపెట్టే బల్లులు.. సిద్దిపేట జిల్లాలో కోమటి చెరువుపై నిలిపిన ఈ పార్క్.. పర్యాటకులకు మరో ఆకట్టుకునే పార్క్‌గా అలరించనుంది. రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్క్‌లతో వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ తీర్చిదిద్దారు. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, ఎన్నో మధురానుభూతులను కలిగించేలా ఈ పార్కు రూపుదిద్దుకుంది.
దేశంలోనే అతిపెద్ద డైనోసార్ పార్క్ :దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్ ప్రసిద్ధి చెందనుంది. బెంబేలెత్తించే డైనోసార్లు.. చీకటి గుహల్లో రాక్షస బల్లుల విన్యాసం.. కదిలే డైనోసార్స్ ఉన్న తొలి డైనోసార్ థీమ్ పార్క్ కావడం గమనార్హం. గుజరాత్ సమీపంలోని రయోలిలో మొదటిసారిగా డైనోసార్ గుడ్లు లభించడంతో అక్కడ డైనోసార్ మ్యూజియం(Museum) ఏర్పాటు చేశారు. ఇందులో నిలకడగా ఉండే డైనోసార్‌లను ప్రదర్శనకు ఉంచారు. ఒక్కటి మాత్రం అరుస్తూ.. కదలికలు ఉండేలా ఏర్పాటు చేశారు. కానీ సిద్దిపేట పార్క్‌లో మాత్రం కదులుతున్న 18 డైనోసార్లు ఉంచారు. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్ పార్క్‌గా అవిష్కృతం కానుంది.