ముట్రాజ్‌పల్లి శివారులో మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఏజెన్సీలతో చర్చించారు. కరోనా నేపథ్యంలో 4 నెలలు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, విడతల వారీగా 60 నుచి 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
దాదాపు 1500 ఇళ్లు పూర్తయితే.. ముంపు గ్రామస్తులను ఇళ్లకు చేరవేయవచ్చనే అంశాలపై అధికారులు, ఏజెన్సీలతో మాట్లాడారు. కరోనా దృష్ట్యా పనులు ఆలస్యమైనందున ముట్రాజ్ పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణంలో కాంట్రాక్టర్ల వద్ద ప్రస్తుతం 600 మంది కార్మికులు ఉన్నారని, పనులు వేగవంతం చేసేందుకు ఒక్కో ఏజెన్సీ అదనంగా 500 మంది కార్మికులను అత్యవసరంగా తెప్పించుకుని పనులు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
కార్మికులను రప్పించడానికి రైలుకైతే రూ.1400, విమానం రూ.4500 రూపాయలు టిక్కెట్టు ధర ఉన్నదని, రెండింటి వ్యత్యాసం రూ.3 వేలుగా ఉందని, కనీసంగా 3 వేల మంది కార్మికులను అత్యవసరంగా విమానంలో తీసుకొచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. విమాన చార్జీలు కాంట్రాక్టర్లే భరించాలని కలెక్టర్ ఆదేశించారు. జూలై నెల 2వ తేదిన తిరిగి సమీక్షా సమావేశం ఉంటుందని, అప్పటి వరకు దాదాపు రెండువేల కార్మికులను రప్పించాలని ఆదేశించారు.