గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్లదేనని సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్ర అని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, వివిధ శాఖల సిబ్బందికి ఆయన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు జిల్లా నుంచి 700 మంది పీఓ, ఏపీఓలు విధుల నిమిత్తం పంపుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి నిర్వహించబోయే ఎన్నికల్లో అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలు, విధి విధానాల ప్రకారం పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పోలింగ్ నిర్వహణ గురించి సమగ్ర అవగాహన పెంపొందించుకుని ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కరదీపికలు చదవాలన్నారు.