ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ మద్యం దుకాణం ముందు శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పండుగ సమయంలో వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లోని మద్యం దుకాణాలన్నీ సిండికేట్‌గా మారి.. ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారని.. ఒక్క క్వాటరు మీద పది నుంచి పదిహేను రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని.. శివసేన హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు.
అధిక ధరకు మద్యం అమ్ముతున్నారని.. శివసేన ఆందోళన - Siddipet District NEws
ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో మద్యం దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివసేన పార్టీ నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న విషయమై పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు తెలిపినా.. వారు సైతం మద్యం దుకాణాల యజమానులతో కుమ్మక్కై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజల నుండి ప్రభుత్వం, అధికారులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.