తెలంగాణ

telangana

ETV Bharat / state

బోసి నవ్వుల ఆశ.. ప్రమాదంతో ఆవిరి - సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం

కుమార్తెకు సుఖంగా ప్రసవం చేయించి మనవడినో, మనవరాలినో చేతిలో పెట్టి.. మురిసిపోదామనుకున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఆశలు పెట్టుకున్న తాత, రెండేళ్ల మనవడు, గర్భస్థ శిశువు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ROAD ACCIDENT AT SIDDIPET DISTRICT
బోసి నవ్వుల ఆశ.. ప్రమాదంతో ఆవిరి

By

Published : May 12, 2020, 11:12 AM IST

తొమ్మిది నెలల గర్భిణి అయిన తన కుమార్తె మరపాక ఝాన్సీని ప్రసవం కోసం తీసుకువచ్చేందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఐసీడీఎస్‌ విశ్రాంత ఉద్యోగి బచ్చల ఆశయ్య(62) భార్య లక్ష్మి, కుమారుడు పరశురాములుతో కలిసి సోమవారం కారులో జనగామ మండలం చౌడారం గ్రామానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో పరశురాములు కారు డ్రైవింగ్ చేస్తుండగా ముందుసీట్లో రెండేళ్ల కుమారుడు జైతో పాటు ఝాన్సీ కూర్చొని ఉన్నారు. మిగతా ఇద్దరు వెనక కూర్చున్నారు. పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా రాజీవ్‌ రహదారిపై గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద వీరి వాహనం రహదారి పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొంది.

ఈ ఘటనలో బాలుడు జై అక్కడికక్కడే మృతి చెందాడు. గర్భిణితో పాటు మిగతా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో గజ్వేల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆశయ్య మృతి చెందారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కాపాడేందుకు శస్త్రచికిత్స చేసి మృత శిశువును బయటకుతీశారు.

ఇదీ చదవండి:వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు

ABOUT THE AUTHOR

...view details