రఘునందన్ రావు తెరాసతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. తెరాసలో సామాన్య కర్యకర్తగా ప్రారంభమైన మాధవనేని రఘునందన్ రావు జీవితం.. భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది.
హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.