సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పత్తి కొనుగోలు దుకాణాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని.. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
క్వింటాల్ పత్తికి 2,500 రూపాయలే ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటకు సరైన ధర లేదని మండిపడ్డారు. హుస్నాబాద్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోయారు.
తరుగు, నాణ్యత అని అనేక సాకులు చెప్తూ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని శివసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మల్లికార్జున్‌రెడ్డి ఆరోపించారు. పత్తి మద్దతు ధర దాదాపు 5600 ఉంటే రైతులకు కనీసం 3000 రూపాయలు కూడా వ్యాపారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వమని చెప్పుకుంటున్న తెరాస.. రైతులను వ్యాపారులు దోచుకుంటుంటే ఏం చేస్తుందని ప్రశ్నించారు. వ్యాపారులపై చర్యలు తీసుకునే నాథుడే లేరని.. కనీసం ఇప్పటికైనా పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చూడండి:'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'