Ponnam Challenge to Harish Rao : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో భూ నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్, సీపీఐ నేతలు సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన నిర్వాసితులను పరామర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే గుడాటిపల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడాలని మంత్రి హరీశ్ రావుకు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. లేనిపక్షంలో నిర్వాసితులను తీసుకుని హరీశ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి నుంచి మంత్రికి ఏం జరగకుండా తమ కార్యకర్తలు రక్షణ కవచంగా ఉంటారని చెప్పారు. మంత్రి ఆదేశాలతోనే నిర్వాసితులపై లాఠీఛార్జ్ జరిగిందని పొన్నం ఆరోపించారు. దీనికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Ponnam prabhakar visits gudatipally: నిర్వాసితులపై లాఠీఛార్జ్, బలప్రయోగం జరగలేదని సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఐపీఎస్ ఉద్యోగంలో ఉన్న ఆమె విజ్ఞత ఇదేనా అని ప్రశ్నించారు. తెరాస నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని మండిపడ్డారు. మంగళవారం రోజున ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చామని.. ఎన్జీటీ కేసు, హైకోర్టు స్టే ఉండగా ట్రయల్ రన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.